నిర్మానుష్యంగా మారిన జుత్తాడ గ్రామ వీధులు విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో బమ్మిడి కిరణ్ కుటుంబానికి చెందిన ఆరుగురిని హతమార్చిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పసిపిల్లలు అని కూడా చూడకుండా పాశవికంగా దాడి చేసిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జిల్లాలోని కింగ్ జార్జి ఆస్పత్రికి తరలించిన అనంతరం.. చాలా మంది గ్రామస్థుల ఇళ్లకు తాళాలు వేశారు.
ఇదీ చదవండి:కిరాతకం: 20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు
హృదయ విదారకర ఘటనతో ఆవేదనకు గురైన గ్రామస్థులు సమీపంలోని వారి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో గ్రామంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అక్కడక్కడ మాత్రమే జనసంచారం కనిపిస్తోంది. ఈ రోజు పోస్టాఫీసు, గ్రామ సచివాలయం మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన దుకాణాలు తెరుచుకోలేదు. మళ్లీ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసు పికెట్, పహారా కొనసాగుతోంది.
ఇదీ చదవండి:విశాఖలో మృతి చెందిన వారు విజయవాడ వాసులుగా గుర్తింపు