HIGH SECURITY: తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తరహాలో రాష్ట్రంలోని కొన్ని స్టేషన్లలోనూ భారీ విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్ల ముందు కంచెలు ఏర్పాటు చేసి, వచ్చిన ప్రయాణికులందర్నీ తనిఖీలు చేశాకే స్టేషన్లలోకి అనుమతించారు. విశాఖలో పోలీసు ఉన్నతాధికారులు భారీ ఎత్తున బలగాలను రైల్వేస్టేషన్‌కు తరలించి, శనివారం తెల్లవారుజామున 4 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్టేషన్లో ఒక్క రైలు కూడా లేకుండా చూశారు. రైల్వేస్టేషన్‌తోపాటు దాని చుట్టూ సుమారు కిలోమీటరు దూరం వరకు జనసంచారం లేకుండా కట్టుదిట్టం చేశారు.
రైల్వే ఉద్యోగులు, స్టేషన్‌లో గదులు బుక్ చేసుకున్న వారిని మినహా ఏ ఒక్కరినీ అక్కడ ఉండనివ్వలేదు. కర్రలు, రాళ్లతో రావాలని.. బెలూన్లలో పెట్రోలు నింపి తీసుకురావాలని.. కొందరి వాట్సప్ సందేశాల్లో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రైల్వేస్టేషన్‌కు ఎలా చేరుకోవాలో వాట్సప్‌లో కొందరికి లొకేషన్ షేర్ చేసినట్లు, స్టేషన్ లోపలికి ఏయే ప్రవేశమార్గాల ద్వారా చేరుకోవాలో తెలిపేలా మ్యాప్‌లు కూడా కొందరికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.
సుమారు 45 మంది అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న పలువురిని ఆరా తీశారు. వారి ఫోన్లను పరిశీలించారు. రైల్వేస్టేషన్ ప్రవేశద్వారాల దగ్గర భారీఎత్తున బలగాల్ని, అగ్నిమాపకశాఖ శకటాలను మోహరించారు. పోలీసులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ, సీఆర్‌పీఎఫ్ తదితర బలగాలన్నీ భద్రత ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. 312 మందిని ముందస్తుగా అరెస్టు చేసి, తర్వాత విడిచిపెట్టారు.