విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలంలో పెదవలస నుంచి నేరేళ్లబంద మీదుగా ఎర్రచెరువుల గ్రామానికి వెళ్లాలంటే.. నిత్యం సాహసం చేయాల్సిందే. నేరేళ్లబంద వరకు రహదారి ఉన్నా... అక్కడ నుంచి ఎర్రచెరువుల వరకు మట్టి రోడ్డే దిక్కు. వర్షాలకు ఈ రహదారి రూపురేఖలను కోల్పోయింది. దారంతా చిత్తడిగా మారి మోకాలి లోతున బురద పేరుకుపోయి ఎర్రచెరువులతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాల గిరిజనులు శ్రమదానంతో కొంత వరకు బాగు చేసినా ఫలితం లేకపోయింది.
ఈ క్రమంలో వారంతా పోలీసులను ఆశ్రయించారు. రహదారి దుస్థితిని వారికి వివరించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారంలో ముందుంటామని పోలీసులు గిరిజనులకు భరోసా కల్పించారు. రహదారి మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. శ్రమదానానికి వచ్చిన గిరిజనులకు పోలీసులే భోజనాలు ఏర్పాటు చేశారు. రోడ్డు మరమ్మతుల నిమిత్తం జేసీబీలను ఏర్పాటు చేశారు. నాలుగు కిలోమీటర్లు రోడ్డును పన్నెండు గంటల శ్రమదానంతో సరిచేశారు.