విధి నిర్వహణలో విశేష సేవలందించిన పోలీసు జాగిలం.. రూబీకి విశాఖ జిల్లా పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. విశాఖ జిల్లా పోలీసు శాఖకు సుమారు 10 సంవత్సరాలు సేవలు అందించి అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి జాగిలం రూబీ మృతి చెందింది. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అదేశాల మేరకు ఇవాళ కైలాసగిరి జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో, పోలీసు జాగిలాం..రూబీకి ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఆర్పీఎల్.శాంతి కుమార్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
పోలీసు జాగిలం రూబీ మృతి విశాఖపట్నం జిల్లా పోలీసు యంత్రాంగానికి తీరనిలోటని ఏఆర్ డీఎస్పీ శాంతి కుమార్ అన్నారు. రూబీ పోలీస్ కుటుంబ సభ్యులలో ఒకరిగా భావించామని, ‘రూబీ ’ ఎన్నో వీవీఐపి బందోబస్తు, అధికారిక సభలు సమావేశాలలో ఆర్ఓపీ విధుల్లో విజయవంతంగా సేవలు అందించిందని, అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించడం చాలా బాధకరమని అన్నారు. రూబీకి ఏఆర్ హెచ్‌సీ కృష్ణారావు హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడన్నారు.