విశాఖ జిల్లా తీగలమెట్ట ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..మరికొంత మంది మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనుమానం వచ్చిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. తీగలమెట్టలో ఎదురుకాల్పులు అనంతరం..విశాఖ-తూర్పు ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టు స్థావరాలపై నిఘా పెంచారు. గత నెలలో పాలసముద్రం వద్ద జరిగిన ఎదురుకాల్పుల సంఘటన నుంచి మావోయిస్టులు తప్పించుకున్నప్పటికీ..అక్కడ లభించిన సమాచారం తీగల మెట్ట వద్ద మావోలను అంతమెందించి విజయం సాధించారు.
ఆందోళనలో గిరిజనులు
ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..పెద్ద సంఖ్యలో మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారన్న సమాచారం ఉంది. తప్పించుకున్న వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉండటంతో పోలీసులు అలుపెరగకుండా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏవోబీ సరిహద్దుల్లో ఉన్న అన్నవరం నుండి కోటగున్నలు వరకు అటవీ ప్రాంతాన్ని, రహదారి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో మళ్లీ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.