విశాఖ మన్యంలోని ధారకొండ ఘాట్ రోడ్డులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు ఇద్దరిని.. గూడెం కొత్తవీధి పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి, ఫిబ్రవరిలో జరిగిన దోపిడీ కేసుల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ వి.విద్యాసాగరనాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ చర్యతో ప్రయాణికుల్లో దైర్యం నింపినట్లయిందన్నారు. వరుస దొంగతనాల కేసులు చేధించడంలో సీలేరు పోలీసులకు స్థానికులు ఎంతగానో సహకరించారని కొనియాడారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ధారకొండ వద్ద అప్రమత్తంగా ఉంటూనే దొంగలను పట్టుకున్నట్లు చెప్పారు.
సెల్‌ఫోన్ పట్టించింది...
జనవరిలో చోరీకి గురైన సెల్‌ఫోన్‌ను ఓ ముఠా సభ్యుడి బంధువు వాడుతుండటంతో.. ఆమెను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎంవీ 82లో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశామని ఏఎస్పీ తెలిపారు. అప్పటినుంచి సమాచార వ్యవస్థపై దృష్టి సారించి.. కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నామన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. ధారాలమ్మ ఆలయం వద్ద ఘాట్‌రోడ్డులోని మూడవ మలుపు సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న బికాస్ అధికారి, మనీశాంత్ సర్కార్ అనే ఇద్దరు ఒడిశా వాసులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.