ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల నియంత్రణకు విశాఖ జిల్లా చింతపల్లి మండలం కోరుకొండలో ఆర్మ్‌డ్ అవుట్ పోస్టు ఏర్పాటు కానున్నదని పోలీసు వర్గాలు తెలిపాయి. అందుకోసం స్థలం సేకరించేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మండంలోని బలపం పంచాయతీలో ఐదేళ్ల కిందట పోలీసు శాఖ ఏర్పాటు చేసిన అవుట్ పోస్టుకు 10 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
కోరుకొండలో ఆర్మ్‌డ్ అవుట్ పోస్టు ఏర్పాటు - విశాఖ ఏజెన్సీలో ఆర్మ్‌డ్ అవుట్ పోస్టు ఏర్పాటు
విశాఖ జిల్లా చింతపల్లి మండలం కోరుకొండలో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించేందుకు ఆర్మ్‌డ్ అవుట్ పోస్టు ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. అందుకోసం తొలివిడతగా రూ.4 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
![కోరుకొండలో ఆర్మ్‌డ్ అవుట్ పోస్టు ఏర్పాటు Police are preparing to set up another armed outpost in visakhapatnam agency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10697442-132-10697442-1613754950869.jpg)
అవుట్ పోస్టు నిర్మాణానికి రూ.26 కోట్లు కేటాయించాలని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిపాదనలు పంపించింది. అందుకు ఆమోదం తెలుపుతూ.. రూ.12 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. తొలివిడతగా రూ.4 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే పెదబయలులోని రూడకోట, జి.మాడుగులలోని నుర్మతి, జీకేవీధిలోని పెదవలస, చింతపల్లిలోని రాళ్లగెడ్డ, కొత్తూరు గ్రామాల్లో ఆర్మ్‌డ్ అవుట్ పోస్టులు ఉన్నాయి. వీటిలో బీఎస్‌ఎఫ్ బలగాలను ఏర్పాటు చేయాలని తొలుత పోలీసు శాఖ భావించినప్పటికీ.. సీఆర్‌పీఎఫ్ బలగాలను నియమించింది.