ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో ఎన్నికల వేళ పోలీసు శాఖ అప్రమత్తం - స్థానిక ఎన్నికలపై మావోయిస్టులు హెచ్చరికలు తాజా వార్తలు

పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన పిలుపుతో.. విశాఖ ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రధాన రహదారుల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకొని, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రహదారుల పక్కన, కల్వర్టులు, వంతెనల కింద డాగ్, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

police alert on local elections
మన్యంలో మూడంచెల భద్రత

By

Published : Feb 16, 2021, 5:32 PM IST


స్థానిక ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన పిలుపు మేరకు మన్యంలో ఎప్పుడేం జరుగుతుందా అనే ఆందోళన నెలకొంది. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ పేరిట ఇటీవల లేఖ విడుదలైంది. మావోయిస్టులు ఏజెన్సీలో మకాం వేసి ఉంటారని, తమ ఉనికిని చాటేందుకు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు... అప్రమత్తమయ్యారు.

ఎస్పీ బి.కృష్ణారావు ఏజెన్సీలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఒడిశా సరిహద్దుల్లోని పంచాయతీలకు అదనపు పోలీస్ బలగాలను తరలించారు. చింతపల్లి మండలంలో బలపం, కోరుకొండ, జీకేవీధి మండలం అమ్మవారి ధారకొండ, దుప్పులవాడ, గుమ్మరేవులు, కొయ్యూరు మండలం బూదరాళ్లతోపాటు జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల శివారు ప్రాంతాలు కలిసే పంచాయతీల్లో గాలింపు చర్యలను ఉద్ధృతం చేశారు.

డ్రోన్‌లతో నిత్యం పహార..

ఏవోబీలోని అన్ని ప్రధాన మార్గాలు, మండల కేంద్రాల్లో సాయుధ పోలీసులు 24 గంటలూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే వాహనాలు, అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచారు. ఎన్నికల సమయంలో దుశ్చర్యలకు పాల్పడే ఉద్దేశంతో యాక్షన్‌ టీమ్‌లు రంగంలోకి దిగవచ్చని, వీరు వాహనాల్లో ఇతర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉందన్న అనుమానంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారపు సంతల్లో నిఘా ఏర్పాటు చేసి, డ్రోన్‌లతో.. నిత్యం పహార కాస్తున్నారు.

మూడంచెల భద్రత..

జీకే వీధి-సీలేరు మార్గంలో బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మండపల్లి, తోకగరువు, రాళ్లగెడ్డ గ్రామాల్లో డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు పరిశీలించారు. మూడంచెల భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌తో నిఘా ఏర్పాటు చేశారు. విశాఖ మన్యంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్పెషల్ పార్టీ బలగాలతో ఏపీఎస్పీ సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇవీ చూడండి...

మావోయిస్టు హెచ్చరికలతో మన్యం వాసుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details