విశాఖ జిల్లాలో వ్యవసాయ శాఖ 'పొలం బడి' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మండల స్థాయి అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 5 నుంచి 10 మంది రైతులను కలిపి ఒక బృందంగా ఏర్పాటు చేసి వారి పొలంలో పైరును పరిశీలించి మెళకువలు చెప్తున్నారు. తక్కువ ఎరువులు వాడడం, తెగుళ్లు నివారించే మందులు సూచించడం వంటివి చేస్తున్నారు. ఈ చర్యల వల్ల రైతుకు పెట్టుబడి తగ్గి మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు.
14 వారాలు పాటు పంటను పరిశీలిస్తామని చెప్పారు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, పెందుర్తి మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పొలంబడి కార్యక్రమంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తమకెంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. అధికారులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో... పంటకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నామని తెలిపారు.