PMGSY Sanctioned Works in Andhra Pradesh: అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులు నిర్ణయమని సీఎం జగన్ పదే పదే ఊదరగొడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖను రాజధానిగా ప్రకటించామని చెబుతుంటారు. ఉత్తరాంధ్రపై మరీ అంత ప్రేమ ఉంటే.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఎందుకు అన్యాయం చేశారో ఆయనే చెప్పాలి. సొంత జిల్లాకు 30కు పైగా పనులు కేటాయించిన జగన్.. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలకు మాత్రం కేవలం 8 పనులే ఇచ్చారు అంటేనే.. ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్రపై ఉన్నది ఉత్తుత్తి ప్రేమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పదేపదే మాట్లాడే ముఖ్యమంత్రి జగన్.. ఆ ప్రాంత అభివృద్ధిపై మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనులే దానికి నిదర్శనం. PMGSY-3లో (Pradhan Mantri Gram Sadak Yojana) మొదటి బ్యాచ్ కింద 2023-24 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 115 రోడ్లు, 72 వంతెనల నిర్మాణ పనులకు వెయ్యి 45 కోట్ల 44 లక్షలకు పరిపాలన అనుమతులిచ్చింది.
ఇందులో బ్యాచ్-1 కింద 187 రోడ్లు, వంతెనల పనులకు అనుమతులిస్తూ జీవో ఇచ్చింది. వీటిలో 576 కోట్ల 15 లక్షలతో 916.22 కిలోమీటర్ల పొడవైన 115 రోడ్లు, 4వందల 69 కోట్ల 29 లక్షలతో 72 వంతెనలు ఉన్నాయి. మంజూరు చేసిన 115 రహదారుల పనుల్లో తన సొంత జిల్లాకే సీఎం జగన్ 32 కేటాయించుకున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ మూడు జిల్లాలకు కలిపి కేవలం 8 పనులుతో సరిపెట్టారు. అంటే.. మొత్తం పనుల్లో ఉమ్మడి కడప జిల్లాకు 27.87 శాతం ఇచ్చుకున్న జగన్.. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు కలిపి 6.9 శాతం పనులే కేటాయించారు.