ప్రశాంత విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. గాజువాకలో యువతి హత్యోందంతం మరువక ముందే.. మరో యువకుడు ప్రేమ పేరిట అమ్మాయి గొంతు కోశాడు. థామ్సన్ వీధిలో ఉండే ప్రియాంక.. డిగ్రీ ఫైనలియర్ చదువుతూ వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. స్థానికంగా ఉండే శ్రీకాంత్.. ప్రేమ పేరుతో ఆమె వెంట పడేవాడు. తిరిగి ప్రేమించాలని చాలాసార్లు ఆమెను ఇబ్బందిపెట్టేవాడు. తల్లిదండ్రుల చెప్పినట్లు నడుచుకుంటానని.. పదే పదే ఆమె చెబుతూ వచ్చింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీకాంత్.. ఉదయం యువతి ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసి.. తననూ గాయపర్చుకున్నాడు. గమనించిన స్థానికులు.. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
కోలుకున్నాక కస్టడీలోకి..
ఘటనా స్థలిని దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ పరిశీలించారు. ఈ దాడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. విశాఖ శాంతిభద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి కేజీహెచ్‌లో ప్రియాంక, శ్రీకాంత్‌కు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన వెంటనే ఆమె వాంగ్మూలం తీసుకుంటామని రస్తోగి తెలిపారు. నిందితుడు కోలుకున్నాక కస్టడీలోకి తీసుకుంటామన్నారు.