Tax Based on the Capital Value of the Property: రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజలపై ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 10నుంచి 15శాతం చొప్పున పెరుగుతోంది. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం 2021-22 నుంచి అమల్లోకి రాగా.. గత మూడు సంవత్సరాలలో ప్రజలపై.. 659కోట్ల 55లక్షల రూపాయల అదనపు భారం పడింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పన్ను చెల్లింపుదారులు, ప్రజాసంఘాలు కొత్త పన్ను విధానాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వం అమలు చేసింది.
ప్రధాన నగరాల్లో ఆస్తి పన్ను భారమిలా..: పాత విధానంలో.. వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన 2020-21లో విశాఖలోని సీతమ్మధారలో 950 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్‌కు.. దాని యజమాని 3వేల 834రూపాయలు పన్ను చెల్లించేవారు. కొత్త విధానం వచ్చాక 2021-22లో ఇది 4వేల 410రూపాయలకు పెరిగింది. 2022-23లో 5వేల 072రూపాయలకు పెరగ్గా, 2023-24లో.. 5వేల 534 రూపాయలకు చేరినట్లు నగరపాలక సంస్థ ఆన్‌లైన్‌లో డిమాండ్ నోటీస్ అప్‌లోడ్ చేసింది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ల శాఖలోని స్ట్రక్చరల్ భూముల విలువ ప్రకారం ఫ్లాట్ విలువ 38లక్షల 80 వేల రూపాయలుగా నగరపాలక సంస్థ నిర్ణయించింది. దీనిపై 0.13%గా నిర్ణయించిన ఆస్తి పన్ను మొత్తంపై.. లైబ్రరీ సెస్సు, ఇతర రుసుముల కింద మరో 8%తో కలిపి వార్షిక పన్ను 10వేల 896 రూపాయలుగా లెక్కకట్టింది. తెలంగాణలో ఆస్తి మూల ధన విలువ ఆధారంగా.. పన్ను విధించే విధానం లేకుండ.. వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్నందున, అక్కడి పట్టణ వాసులపై అదనపు పన్ను బాదుడు లేదు.
విశాఖలోని న్యూ వెంకోజీపాలెంలో ఓ వాణిజ్య భవనానికి మూడు సంవత్సరాలలో.. ఆస్తి పన్ను 20వేల 660 రూపాయలకు పెరిగింది. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం రాకముందు సంవత్సరానికి లక్షా 43వేల 046 రూపాయలు పన్ను చెల్లించేవారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక 2021-22లో లక్షా 57వేల 350రూపాయలకు చేరింది. 2022-23లో మళ్లీ లక్షా 60వేల 498 రూపాయలకు పెంచారు. 2023-24లో లక్షా 63వేల 706 రూపాయలకు పెరిగింది. విశాఖలోని ఎంవీపీకాలనీ సెక్టార్-8లో ఓ మధ్య తరగతి కుటుంబం నివసిస్తున్న ఇంటికి.. మూడేళ్లలో ఆస్తి పన్ను 2,058 రూపాయలు పెరిగింది. పాత విధానంలో ప్రతి ఏడాది 3,952రూపాయలు చెల్లించేవారు. కొత్త విధానంలో 2021-22లో 4,544రూపాయలకు చేరగా, 2022-23లో 5,226, 2023-24 నాటికి 6,010రూపాయలకు పెంచారు.
గుంటూరులోని అరండల్‌పేటలో ఒక వాణిజ్య భవనానికి మూడేళ్ల క్రితం.. 76వేల 058 చెల్లించిన వార్షిక ఆస్తి పన్ను.. 2023-24 నాటికి 87వేల 44రూపాయలకు పెరిగింది. కొత్త విధానంలో 10వేల 986 రూపాయల భారం పడింది. గోరంట్లలో ఓ ఫ్లాట్‌కు గతంల ఆస్తిపన్ను 2వేల992 రూపాయలు చెల్లించగా, 2021-22లో 3,440, 2022-23లో 3,956రూపాయలకు పెరిగింది. తాజాగా 4వేల 264 రూపాయలకు పెంచారు. మొత్తంగా మూడేళ్లలో 12వందల 72రూపాయల భారం పడింది.