New Year celebrations: రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా నూతన సంవత్సర వేడుకలు..అద్భుతమైన రీతిలో సాగాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కొత్త ఏడాది సంబరాల్లో మహిళలు నృత్యాలతో సందడి చేశారు. విశాఖ బీచ్ పరిసరాలు నగరవాసులతో కిక్కిరిసిపోయాయి. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత చిన్నాపెద్దా, యువత అనే తేడా లేకుండా అంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. విశాఖ ఎమ్.వీ.వీ సిటీలో విద్యుత్ దీపాలు, డీజే పాటల నడుమ అపార్ట్‌మెంట్ వాసులు కొత్త ఏడాది వేడుకలు జరుపుకున్నారు.
విజయవాడ ఫన్ టైం క్లబ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. వేదికపై సింగర్స్ పడిన పాటలు పలువురుని ఆకట్టుకున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొన్నారు. 2023లో రాష్ట్రం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని గద్దె రామ్మోహన్ ఆకాంక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు మంగళగిరి మిడ్ వ్యాలీలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. అపార్ట్‌మెంట్ వాసులంతా కుటుంబసభ్యులా మారి చిన్నారులు, యువతతో కలిసి సందడి చేశారు. నిర్వాహకులు ప్రత్యేకంగా ఆటల పోటీల్లో నిర్వహించగా..అంతా ఉత్సాహం పాల్గొన్నారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. విద్యా, ఉద్యోగాలకు సంబంధించి సరికొత్త లక్ష్యాలకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు స్పష్టం చేశారు. గుంటూరులోని వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు హూషారైన పాటలకు స్టెప్పులు వేస్తూ కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు.
కర్నూలు రాజ్ విహర్ కూడలిలో యువత కేరింతలు కొడుతూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అనంతపురం టవర్ క్లాక్ వద్ద యువత ఆటపాటలతో సందడి చేశారు. కేకులు కట్ చేసి, టపాసులు పేలుస్తూ నృత్యాలు చేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చిన్నా, పెద్దా తేడా లేకుండా నగరవాసులంతా నూతన సంవత్సరానికి శుభ స్వాగతం పలికారు. అలరించే నృత్యాలతో 2023కి అదిరే ఆరంభమిచ్చారు. నెల్లూరులో వీఆర్సీ సెంటర్ వద్ద యువత కేకులు కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాణాసంచా కాలుస్తూ నూతన సంవత్సర వేడుకల్లో సందడి చేశారు.
ఇవీ చదవండి: