ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టాలెక్కని పెళ్లి కానుక.... జంటల నిరీక్షణ - వైఎస్సార్‌ పెళ్లికానుక పథకం

నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం భారం కాకూడదని, పెళ్లయిన తరువాత అత్తారింట అభద్రతా భావంతో ఉండకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. సామాజిక వర్గాల వారీగా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకాలను అందించింది. వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత తెదేపా హయాంలో కంటే భారీ ప్రోత్సాహకమే ఇస్తామని ప్రకటించింది. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి వైఎస్సార్‌ పెళ్లికానుక పేరిట అమలులోకి తెస్తామని చెప్పింది. కరోనా లాక్‌డౌన్‌తో ఈ పథకం అమలుకాలేదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న జంటలంతా నిరీక్షించాల్సి వస్తోంది.

pelli kanuka
pelli kanuka

By

Published : Jun 16, 2020, 11:56 AM IST

విశాఖ జిల్లాలో గతేడాది మార్చి వరకు జరిగిన వివాహాలకు సంబంధించి చంద్రన్న పెళ్లికానుక పథకంలో రూ. 14 కోట్లు ప్రోత్సాహకాల రూపంలో చెల్లించారు. తరువాత సాధారణ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినా ప్రోత్సాహకం మాత్రం అందలేదు. గతేడాది చివర్లో వైఎస్సార్‌ పెళ్లికానుక పేరిట భారీ నజరానాను సర్కారు ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. గతంలో ఎస్సీలకు రూ. 40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు అందజేశారు.
వైఎస్సార్‌ పెళ్లికానుకలో వీరి ప్రోత్సాహక మొత్తాన్ని రూ.లక్షకు పెంచింది. బీసీ యువతులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు, కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు, దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు ప్రోత్సాహకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రోత్సాహకం కంటే అన్ని కేటగిరీల్లోనూ పెంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా శ్రీరామనవమి నుంచి అమలులోకి రావాల్సిన ఈ పథకం లాక్‌డౌన్‌తో ఆగిపోయింది.

ఖాతాలో రూపాయి వేశారు..

మాది జుత్తాడ. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిచేసుకున్నాం. పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకుంటే పెళ్లయిన కొద్దిరోజులకు మా ఖాతాలో రూపాయి జమ చేశారు. మిగతా డబ్బులు వస్తాయని చెబుతున్నారు. మాకంటే ముందు చేసుకున్న వారికి ఇప్పటికీ డబ్బులు అందలేదు. ఏదోక రోజు వస్తాయనే ఆశతో ఉన్నాం.

- పి.గంగాధర్, జుత్తాడ

పందిట్లో ఇస్తామన్నారు..!

మేం 2019 ఏప్రిల్‌ 19న పెళ్లిచేసుకున్నాం. అంతకు పది రోజుల ముందే పెళ్లికానుక పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. మాకంటే ముందు పెళ్లి చేసుకున్న వారికి పందిట్లోకి తెచ్చే సొమ్ములు ఖాతాలో పడినట్లు మంజూరు పత్రాలు ఇచ్చేవారు. మాకు ఎన్నికల కోడ్‌ ఉంది. తరువాత ఇస్తామన్నారు. ఖాతాలో ఒక రూపాయి వేశారు. ఏడాది గడిచిపోయింది. ఇప్పటికీ ఈ సాయంపై అడిగితే అదిగో ఇదిగో అనడమే తప్పా ఎప్పుడిస్తారో మాత్రం చెప్పడం లేదు. - కల్లూరి భవాని, మహేష్, నక్కపల్లి మండలం

ఆందోళన అవసరం లేదు..

పెళ్లికానుక బకాయిలు త్వరలోనే వారి ఖాతాలకు జమవుతాయి. వాటి కోసం ఆందోళన చెందనవసరం లేదు. పెంచిన ప్రోత్సాహకం మాత్రం శ్రీరామనవమి నుంచి అమలు చేస్తామన్నా కరోనా వల్ల జాప్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుంది. అర్హులైన వారందరికీ పెళ్లికానుక అందుతుంది. - విశ్వేశ్వరరావు, పీడీ, డీఆర్‌డీఏ

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్​: చిన్న పరిశ్రమలకు చిక్కులు.. మార్కెట్​ లేక మల్లగుల్లాలు

ABOUT THE AUTHOR

...view details