కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం... స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయవలసిందేనని తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. పరిహారం ఇచ్చారు... మరి పరిష్కారం ఎప్పుడు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయాలా?: పవన్ - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
పారిశ్రామిక వృద్ధి కంటే.. ప్రజల ప్రాణాలు ఇంకా ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గ్యాస్ బాధితులను తక్షణం ఆదుకోవాలని.. శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు అందించాలని కోరారు.
పర్యావరణం, జనజీవన హితంగా ఉండే పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. పారిశ్రామికాభివృద్ధి పర్యావరణహితంగానూ, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఉండాలని హితవు పలికారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం నివ్వెరపోతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. స్టైరీన్ గ్యాస్ పీల్చినవారు భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి: 'అతనెవరో గుర్తించలేదు.. తర్వాతే డాక్టర్ అని తెలిసింది'