Pawan Kalyan Meet with Janasena Party Leaders:ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నాయకులు, పాలకుల వేధింపులతో ఇబ్బంది పడని వర్గమంటూ ఏదీ లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి యువతకు, మహిళలకు భరోసా లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీని సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ సూచించారు.
Pawan, Manohar Meet with Party Leaders: విశాఖలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ జిల్లా నాయకులు, పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నియోజకవర్గ బాధ్యులు, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో పార్టీ పొత్తు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల పక్షాన చేయాల్సిన పోరాటాలపై పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.
అధికారం కోసం కాదు - మార్పు కోసం ఓట్లు కావాలి: పవన్ కల్యాణ్
Pawan Kalyan Comments: పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ..''టీడీపీని సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాల్సిన సమయం పార్టీ కార్యకర్తలకు ఆసన్నమైంది. అందరూ కలిసికట్టుగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు అధికారంలోకి వస్తాయి. వైసీపీ నాయకులు, పాలకుల వేధింపులతో రాష్ట్రంలో ఇబ్బంది పడని వర్గమంటూ ఏదీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. యువతకు, మహిళలకు భరోసా లేకుండా పోయింది. వైసీపీ పాలనలోని లోపాలను ఎండగడుతూ, ప్రజాపక్షాన మనం చేసిన పోరాటాలు, కష్టంలో ఉన్నప్పుడు స్పందించిన విధానాలే మనల్ని నిలబెడుతాయి. కాబట్టి పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలి'' అని ఆయన అన్నారు.