PAWAN FIRES ON YSRCP : జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే విమానాశ్రయంలో దాడి ఘటనతో వైకాపా అనవసర రాద్ధాంతం చేస్తోందని.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపించారు. మంత్రులకు సహజంగా ఉండే భద్రత కూడా నిన్న దాడి ఘటనప్పుడు లేదన్నారు. ఏకస్వామ్య వ్యవస్థతో మనుగడ సాధిస్తున్న వైకాపా.. వికేంద్రీకరణ చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర కోసం తెగ ఆరాటపడుతున్న వైకాపా.. మూడున్నరేళ్లు ఏంచేసిందని నిలదీశారు.
ఉత్తరాంధ్రపై ధర్మానకు ప్రేమ ఉంటే ఆ భూమిని విడిపించాలి: మాజీ సైనికుల భూమిని ధర్మాన ఆక్రమించారని.. ఉత్తరాంధ్రపై ధర్మానకు ప్రేమ ఉంటే ఆ భూమిని విడిపించాలని పవన్ డిమాండ్ చేశారు. వైకాపా చేసే అక్రమాలు చూడటానికి జీవితకాలం సరిపోదన్నారు. ఎయిర్‌పోర్టు వద్ద ఘటన వెనుక ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని భావించట్లేదని తెలిపారు. ప్రజా ఉద్యమాలను ఎదుర్కోలేనందునే వైకాపాకు భయం పట్టుకుందని పేర్కొన్నారు.
వారు జైళ్లలో ఉంటే జనవాణి చేయడం సరికాదు : 'జనవాణి' కార్యక్రమంలో గొడవ చేయాలనేదే వారి ఉద్దేశం అన్నారు. 'జనవాణి' ద్వారా నన్ను ఆపడం కాదు.. జనాల గొంతు నొక్కడమే అని తెలిపారు. జనవాణికి సంబంధించి కీలక నాయకులను అరెస్టు చేశారని. వారు జైళ్లలో ఉంటే జనవాణి చేయడం సరికాదన్నారు. జనసేన నాయకులపై కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని.. అరెస్టు చేసిన ప్రాంతాలకు వెళ్లే విషయమై చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
విధాన నిర్ణయాలు చేసేవారితోనే మా పోరాటం:అధికార వికేంద్రీకరణ చేయాలనేది ప్రభుత్వ వాదన అని.. అమరావతి రాజధానిగా ఉండాలనేది జనసేన ఆలోచన అని పవన్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల ఆలోచన మా దృష్టిలో లేదని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు అధికారాలు ఉండవన్నారు. ఒక్క వ్యక్తి గొంతుకను మాత్రమే వీళ్లంతా వ్యక్తీకరిస్తారన్నారు. అధికారం గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి.. వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గొడవలు పెట్టుకోవాలని పోలీసులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. విధాన నిర్ణయాలు చేసేవారితోనే మా పోరాటం అని స్పష్టం చేశారు. వైకాపా గూండాల ఉడుత ఊపులకు భయపడనన్నారు.