ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ORGANS: ‘జీవన్‌దాన్‌’ పిలుపునకు నిరీక్షిస్తున్న 2,037 మంది రోగులు - ఏపీ తాజా వార్తలు

వారి జీవకణం నిస్తేజమై మరో కారుణ్యమూర్తి తోడు కోరుకుంటోంది. వారు కీలక అవయవాలు దెబ్బతిని శరీర ధర్మానికి దూరమవుతున్నారు.. పుట్టుకతోనూ వైకల్య పీడితులు కూడా ఎందరో. ఒక్క అవయవం సమకూరితే వారిలో చాలా మంది నవజీవితానికి శ్రీకారం చుడతారు. ఇదే ఆశతో ‘జీవన్‌దాన్‌’లో పేరు నమోదు చేసుకుంటున్నారు. అయినప్పటికీ నిరాశే ఎదురవుతోంది. రెండేళ్లు దాటుతున్నా.. తమ దరఖాస్తులో చలనం లేకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. మరోవైపు ఆత్మీయుల అవయవాల దానానికి ముందుకొచ్చే కుటుంబీకులకు కూడా సరైన దిశానిర్దేశం కనిపించడం లేదు.

For organs
For organs

By

Published : Aug 2, 2021, 9:58 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలానికి చెందిన పదేళ్ల బాలుడికి పుట్టుకతోనే మూత్రపిండం దెబ్బతింది. కిడ్నీ మారిస్తేనే జీవితం నిలబడుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు రెండేళ్ల కిందట జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పటినుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అవయవం మాత్రం అందలేదు.

విశాఖ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 50ఏళ్ల వ్యక్తి కిడ్నీ కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో మొదటి ప్రాధాన్యం కింద టోకెన్‌ ఇవ్వలేదు. అదిగో ఇదిగో అంటూ ట్రస్టు అధికారులు వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగా క్షీణించింది. కిడ్నీ మార్పిడికి శరీరం సహకరిస్తుందో లేదోనని కుటుంబీకులు మనస్తాపం చెందుతున్నారు.

వారి ప్రాణాలు చివురుటాకులు..

వారి జీవకణం నిస్తేజమై మరో కారుణ్యమూర్తి తోడు కోరుకుంటోంది. వారు కీలక అవయవాలు దెబ్బతిని శరీర ధర్మానికి దూరమవుతున్నారు.. పుట్టుకతోనూ వైకల్య పీడితులు కూడా ఎందరో. ఒక్క అవయవం సమకూరితే వారిలో చాలా మంది నవజీవితానికి శ్రీకారం చుడతారు. ఇదే ఆశతో ‘జీవన్‌దాన్‌’లో పేరు నమోదు చేసుకుంటున్నారు. అయినప్పటికీ నిరాశే ఎదురవుతోంది. రెండేళ్లు దాటుతున్నా.. తమ దరఖాస్తులో చలనం లేకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. మరోవైపు ఆత్మీయుల అవయవాల దానానికి ముందుకొచ్చే కుటుంబీకులకు కూడా సరైన దిశానిర్దేశం కనిపించడం లేదు.

జీవన్‌దాన్‌ ద్వారా సమయానికి అవయవదాతలు దొరక్క రాష్ట్రవ్యాప్తంగా ఎందరో దరఖాస్తుదారులు కుంగిపోతున్నారు. ఇప్పటికే 2,037 మంది వివిధ అవయవాల కోసం నిరీక్షిస్తున్నారు. వీరిలో చాలామంది ఆరోగ్యం ఏడాదిగా క్షీణిస్తోంది. కిడ్నీ, కాలేయం అవసరం ఉన్నవారే 71% ఉన్నట్లు స్పష్టమవుతోంది.

దాతలొచ్చినా మనసు కరగలేదు

ఏడాదిన్నర నుంచి కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో అవయవదానం మూలపడింది. బ్రెయిన్‌డెడ్‌తో మరణించే స్థితిలో ఉన్నవారి శరీర అవయవాలను ఇచ్చేందుకు కుటుంబీకులు ముందుకొచ్చినా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులు కొన్నిసార్లు తిరస్కరిస్తున్నాయి. విశాఖలో 4 కుటుంబాలు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి మరో 8 కుటుంబాలు ఇలా తమ వారి అవయవాలను ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. కానీ ‘కొవిడ్‌ చికిత్సల్లో బిజీగా ఉన్నాం. తీసుకోలేం’ అని వైద్యులు తేల్చిచెప్పారు. ఆత్మీయులు మరణించాక ఆ మృతదేహాల్ని పరిశోధనల కోసం వైద్య కళాశాలలకు అప్పగించారు. అది కూడా కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన 24గంటల తర్వాతే వాటిని తీసుకున్నారు.

* ఏపీలో జీవన్‌దాన్‌ ట్రస్టు పూర్తిగా చేతులెత్తేసినా, తెలంగాణలో బతిమిలాడాక అవయవాలు తీసుకున్నారు. విశాఖ గాజువాకకు చెందిన కనుమూరి సీతారామరాజు (28) బ్యాంకు మేనేజర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. ఆయన అవయవాలను దానం చేద్దామని అక్కడి జీవన్‌దాన్‌ ట్రస్టును కుటుంబీకులు ఆశ్రయించారు. మొదట్లో ససేమిరా అన్నా.. 3 రోజుల తర్వాత కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, నేత్రాలు, బోన్‌మ్యారో.. ఇలా 8 అవయవాలను తీసుకున్నారు. అప్పటిదాకా రోజుకు రూ.50వేల ఖర్చు భరించి కుటుంబీకులు వెంటిలేటర్‌పై ఉంచారు.

ప్రభుత్వాసుపత్రుల అలసత్వం

విశాఖ కేజీహెచ్‌, గుంటూరు జీజీహెచ్‌, తిరుపతి స్విమ్స్‌, కర్నూలు జీజీహెచ్‌ ఆసుపత్రులు ఇదివరకే అవయవదానానికి అర్హత సాధించాయి. కానీ ప్రయోజనం నామమాత్రం అవుతోంది. 2014 నుంచి ఇప్పటిదాకా కేవలం ఐదుగురి నుంచే అవయవాలను సేకరించి మార్చారు. కేజీహెచ్‌, కర్నూలు జీజీహెచ్‌లో ఒక్క దాతనూ నమోదు చేయలేదు.

అక్రమాలతో భయం

2019లో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్‌ బయటపడటంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. తర్వాత విశాఖలో మరో ప్రైవేటు ఆసుపత్రిలోనూ ఇలాగే జరిగింది. దీంతో అవయవదానానికి ముందుకొచ్చే కుటుంబాలూ వెనకడుగు వేశాయి. ల్యాబొరేటరీ, పలు విభాగాలు అందుబాటులో లేవని అవయవ మార్పిడి కోసం వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు.

ఆరోగ్యశ్రీలో చేరిస్తేనే న్యాయం

అవయవాలకు దరఖాస్తు చేసుకున్నవారు ఏమయ్యారో తెలుసుకోవాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి దాతలను సమకూర్చాలి. రాష్ట్రంలో అవస్థలు పడుతోంది పేదలే. వారికి న్యాయం జరగాలంటే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవ మార్పిడి జరగాలి. అవి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలి. అవయవాలు ఇవ్వలేకపోతే బాధితులు దరఖాస్తు కోసం కట్టిన రూ.10వేలను వెనక్కి ఇచ్చేయాలి.- గూడూరు సీతామహాలక్ష్మి, అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం అధ్యక్షురాలు

పారదర్శకంగా ఉంటాం

జీవన్‌దాన్‌ను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. అవయవాల కోసం వేచి ఉండే వారికి న్యాయం చేస్తాం. కొవిడ్‌ కారణంగా దాతల గుర్తింపు కష్టతరమైంది. బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తుల్ని గుర్తించేందుకు, అవయవాలను రోగులకు అమర్చేందుకు చర్యలు చేపడతాం. అవయవ దాతలను గుర్తించిన వైద్యులకు ప్రోత్సాహకాలూ ఇస్తాం. ఆసుపత్రుల సంఖ్య బాగా తక్కువున్న రాయలసీమ వైపు దృష్టి సారించాల్సి ఉంది. ఆగస్టు 6 నుంచి 13వరకు అవయవ దానాలపై వారోత్సవాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతాం.-డాక్టర్‌ కె.రాంబాబు, జీవన్‌దాన్‌ కన్వీనర్‌ , విశాఖపట్నం

ఇదీ చదవండి: ఐటీ చట్టం సెక్షన్‌-66ఏ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు

ABOUT THE AUTHOR

...view details