మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గతంతో పోలిస్తే ఏయేటికాయేడు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తక్కువ సమయంలో తత్కాల్ పాస్‌పోర్టు పొందేందుకు.. రాష్ట్ర వ్యాప్తంగా సేవాకేంద్రాలు విస్తరిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 5 లక్షల పాస్‌పోర్టులు జారీ అవుతున్నాయి. ఈ ప్రక్రియను.. మరింత సులభతరం చేసింది మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. తత్కాల్ పాస్‌పోర్టు పొందేందుకు సమర్పించాల్సిన పద్ధతిని సరళతరం చేసింది. పాస్‌పోర్టు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిన నిబంధనను తొలగించింది.
నెల రోజుల్లో అందుబాటులోకి..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారి సౌలభ్యం కోసం నిర్దేశిత పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పోస్టాఫీసుల అనుసంధాన ప్రక్రియ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. పోస్టాఫీసుల్లోని పాస్‌పోర్టు సేవాకేంద్రాల ద్వారా ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పోస్టాఫీసులో పాస్‌పోర్టు సేవాకేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుంది.