విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు వేల సంఖ్యలో ఉంటున్నారు. ఆర్టీసీ బస్ పరంగా రెండు ఆర్డినరీ, ఒక ఏసీ బస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ బస్సులు మరో మూడు నడుస్తున్నాయి. ఇక రైలు విషయానికి వస్తే తిరుమల ఎక్స్‌ప్రెస్, తిరుమల ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. భువనేశ్వర్ నుంచి తిరుపతి వైపు వెళ్లే మరో రెండు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖ నుంచి దాదాపు ఐదువేల మంది ప్రయాణికులు ఈ రైళ్ల ద్వారా రోజూ తిరుపతి వెళ్తున్నారు. తిరుపతి వెళ్లేందుకు సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అన్ని గంటలు ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు చెబుతున్నారు.
విశాఖ నుంచి తిరుపతికి ఇదివరకు విమాన సర్వీసులు ఉండేవి. ఇటీవలే వాటిని రద్దు చేశారు. హఠాత్తుగా సర్వీస్ నిలిచిపోవడంతో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి తిరుపతికి విమాన సర్వీసులు పునరుద్ధరించాలని కోరుతున్నారు. విశాఖ నుంచి తిరుపతికి మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించాలని, ప్రజా ప్రతినిధులు స్పందించాలని ఉత్తరాంధ్ర వాసులు కోరుతున్నారు.