మావోయిస్టు పార్టీ కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సురేంద్ర అనే పేరు మీద వచ్చిన ఆడియోపై విశాఖ జిల్లా పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ స్పందించారు. మావోయిస్టులు గిరిజనులతో చట్ట వ్యతిరేక పనులు చేయిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలిసో తెలియకో మావోయిస్టులతో చేతులు కలిపి.. వారికి మిలీషియాగా పని చేస్తున్న గిరిజనులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టు నేతల మాటలు విని మీరు గిరిజన ప్రాంతంలో గ్రామాల చుట్టూ పోలీసులను చంపాలనే ఉద్దేశంతో మందుపాతరలు పెడితే అక్కడ నివసించే అమాయక గిరిజనులు వాటికి బలైపోతున్నారు. గిరిజనుల ప్రాణాలంటే మావోయిస్టులకు లెక్కలేదు. మావోయిస్టులు మన్యం ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు వారికి సహకరిస్తూ.. తప్పించుకునేందుకు సహాయపడుతున్నారు. చివరకు వారి మాటలు విని మీరు తోటి గిరిజనులనే హతమారుస్తున్నారు. మావోయిస్టులతో చేతులు కలిపినప్పటి నుంచి మీరు ఎంతటి దుర్భరంగా జీవనం సాగిస్తున్నారో నాకు తెలుసు. ఇప్పటికే గ్రామస్థుల్లో మీపై వ్యతిరేకత వచ్చింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతల చేతుల్లో మీరు కేవలం కీలుబొమ్మలని గిరిజనులు తెలుసుకున్నారు. మీరు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.