ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యకు చెప్పకుండా.. భర్త అవయవాల దానం! - Organs Donation Case Filed in vishaka latest news

రహదారి ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తికి సంబంధించిన అవయవదానం ప్రక్రియ భార్యకు తెలియకుండానే జరిగిపోయింది. సుమారు 3 సంవత్సరాలకుపైగా న్యాయపోరాటం చేస్తున్న ఆ మహిళ ఎట్టకేలకు ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టేలా చేసింది. ప్రమాద బీమా కోసం ఆ మహిళ దరఖాస్తు చేసుకోవడంతో అసలు విషయం తెలుసుకుంది. విశాఖకు చెందిన ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ వ్యవహారం అంతా జరిగింది.

organs-donation-case-filed-in-vishaka
organs-donation-case-filed-in-vishaka

By

Published : May 7, 2020, 5:59 PM IST

విశాఖ నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రిలో తనకు చెప్పకుండా భర్త అవయవాల్ని జీవన్‌దాన్‌ కార్యక్రమంలో భాగంగా దానమిచ్చేశారంటూ బాధిత మహిళ జాతీయ మానవహక్కుల కమిషన్‌, న్యాయస్థానం, పోలీసులను ఆశ్రయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేయాల్సిందిగా న్యాయస్థానం, జాతీయ మానవహక్కుల కమిషన్‌ నుంచి ఉత్తర్వులు రావడంతో విశాఖ నగర పోలీసులు రంగంలోకి దిగారు.

డీసీపీ-1 రంగారెడ్డి, సి.ఐ. రామారావు చెప్పిన వివరాల ప్రకారం.... ఒడిశాలోని గంజాం ప్రాంతం జాగాపూర్‌కు చెందిన కడియాల సహదేవ్‌ 2016 డిసెంబరు 13న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ మర్నాడు ఆయన్ను విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అదే నెల 19న రాత్రి జీవన్మృతుడు(బ్రెయిన్‌ డెడ్‌)గా మారారు. అప్పటికి ఆసుపత్రి బిల్లు సుమారు రూ. 1.70 లక్షలు చెల్లించాల్సి ఉంది. తల్లిదండ్రులు జీవన్‌దాన్‌ కింద అతని కిడ్నీలు, లివర్‌, రెండు కళ్లు(కార్నియాలు) దానమిచ్చారు.

అవయవాల్ని దానం చేయాలంటే జీవిత భాగస్వామి సంతకం తప్పనిసరిగా ఉండాలన్నది బాధితురాలి వాదన. తన సంతకం చేయించుకోలేదన్నది ఆమె ఫిర్యాదు. ఆ సమయంలో ఆమె గర్భిణి. భర్త చనిపోయాక బీమా కోసం దరఖాస్తు చేయగా ఆ సంస్థ స్పందిస్తూ.. శరీరంలో అవయవాలు లేవని రిపోర్టు ఉందని, బీమా చెల్లించలేమని నిరాకరించింది. దీంతో ఆమె జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో బెర్హంపూర్‌ ఎస్‌.డి.జె.ఎం. న్యాయస్థానంలో కూడా ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఒడిశా పోలీసులు ఆ కేసును గత మార్చిలో విశాఖ త్రిటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు పంపారు. ఈ కేసును సీఐ కోరాడ రామారావు కేసును విచారిస్తున్నారు.

పోలీసుల వైఫల్యంపై ఆరా..:

సహదేవ్‌ చనిపోయిన తరువాత విశాఖ టు టౌన్‌ పోలీసులు రోడ్డుప్రమాదం కేసును నమోదు చేశారు. నాడు దర్యాప్తు చేసిన ఎస్‌.ఐ. గణపతిరావు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో విఫలమైనట్టు పోలీసుల ప్రాథమిక పరిశీలనలో తేలింది. దీంతో డీసీపీ-1 రంగారెడ్డి ఛార్జిమెమో జారీ చేశారు. నాటి సీఐ, ఏసీపీలు కేసు పర్యవేక్షణలో సమర్థంగా వ్యవహరించారా? లేదా? అన్నదానిపైనా విచారణ చేస్తున్నారు.

వివాహం అయినట్లు చెప్పలేదు..:

అవయవదానం చేసిన వ్యక్తికి వివాహమైనట్టు చెప్పనందునే తాము తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకున్నామని కార్పొరేట్‌ ఆసుపత్రి ప్రతినిధి సుధాకర్‌ ‘ఈనాడు’కు వెల్లడించారు. నిబంధనలు పాటించాకే అవయవదాన శస్త్రచికిత్సలు చేశామని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, న్యాయస్థానాలకు వివరించామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని నగర డీసీపీ-1 ఎస్‌.రంగారెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. భార్యకు సమాచారం ఇవ్వకుండా భర్త అవయవాల్ని దానం చేయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:విశాఖ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం

ABOUT THE AUTHOR

...view details