ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడాదైనా... అమల్లోకి రాని విశాఖ రైల్వే జోన్‌ - one year for sanction the new railway zone to visakha

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గతేడాది ఫిబ్రవరి 27న అప్పటి రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. అయినా ప్రక్రియ వేగంగా సాగడం లేదు. 11 నెలల్లోనే జోన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామంటూ గత ఏడాది మార్చి 8న దిల్లీలో గోయల్‌ మరోసారి స్పష్టం చేశారు. తీరా జోన్‌ ప్రకటన జరిగి ఏడాదైనా ఇప్పటి వరకు కొత్తజోన్‌ అమల్లోకి రాలేదు.

one year for sanction the new railway zone to visakha
ఏడాదైనా...అమల్లోకి రాని విశాఖ రైల్వే జోన్‌

By

Published : Feb 27, 2020, 7:29 PM IST

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్​ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించి ఏడాదైన ఇప్పటివరకూ ఆ పనుల్లో పురోగతి లేదు... ఈ ఏడాదిలో అసలు ఏం జరిగిందంటే!

ఏడాదిలో జరిగిందిదీ..

గుంతకల్లు, గుంటూరు డివిజన్లు పూర్తిగాను, విజయవాడ, వాల్తేరు డివిజన్లలో కొంత భాగం కలిపి కొత్త జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాది మార్చిలో కొత్త జోన్‌ ప్రక్రియ కోసం ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ)ని నియమించారు. ఆయన ఆధ్వర్యంలో కొత్తజోన్‌ పరిధిలోకి ఏమేమి వస్తాయనేది నివేదిక తయారు చేశారు. డివిజన్లు, కొత్త జోన్‌ సరిహద్దులు, ఆస్తులు, రైళ్ల వివరాలు, కొత్త కార్యాలయాల ఏర్పాటు, అవసరమైన అధికారులు, సిబ్బంది, మౌలిక వసతులు తదితర వివరాలన్నింటితో నివేదికను గత ఆగస్టులో రైల్వే బోర్డుకు పంపారు. మొత్తం 3,496 కిలోమీటర్ల మేర రైల్వే మార్గాలు, 5,437 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు దీని పరిధిలోకి తీసుకొస్తున్నారు.

ప్రారంభ తేదీ ప్రకటన ఎప్పుడు?

రైల్వే బోర్డుకు పంపిన నివేదికను అందులోని డైరెక్టర్లు పరిశీలించి అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియజేస్తారు. ఇదంతా పూర్తయ్యాక బోర్డు నుంచి రైల్వే మంత్రికి పంపిస్తారు. ఆయన ఆమోదించిన తర్వాత ఏ తేదీ నుంచి కొత్త జోన్‌ అమల్లోకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తేదీ నుంచి దక్షిణ కోస్తా జోన్‌ కార్యకలాపాలు మొదలవుతాయి.

కొత్త జోన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత జనరల్‌ మేనేజర్‌ సహా, ఇతర ఉన్నతాధికారులు, వివిధ విభాగాలకు అవసరమైన కార్యాలయాల నిర్మాణం, క్వార్టర్ల నిర్మాణం తదితరాలు అన్నీ పూర్తి చేసేందుకు కనీసం రెండు, మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. ఇందుకు దాదాపు రూ.200 కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయని అంచనా. 2020 - 21 కేంద్ర బడ్జెట్‌లో మాత్రం దక్షిణ కోస్తా జోన్‌తోపాటు, రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్‌కు కలిపి కేవలం రూ.3 కోట్లు మాత్రమే కేటాయించారు. జోన్‌ అమలు తేదీ ప్రకటించిన తర్వాత బడ్జెట్‌తో సంబంధం లేకుండా అవసరమైన నిధులు ఇచ్చేందుకు వీలుంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ‘కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ఫలానా తేదీ నుంచి ప్రారంభమవుతుందని (కమెన్స్‌మెంట్‌ డేట్‌) రైల్వే మంత్రి ప్రకటిస్తే, ఆ తేదీ నుంచి కొత్త జోన్‌ అమల్లోకి వస్తుందని, ఆ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని’ రైల్వేలోని ఓ కీలక అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:

'ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చొని పరీక్ష రాయరు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details