విశాఖ మన్యంలో భూ కబ్జాపై ఈటీవీ భారత్లో ప్రచురితమైన 'రహదారిపై వైకాపా నేత కన్ను... రాత్రికి రాత్రే చదును' అనే కథనానికి అధికారులు స్పందించారు. ఈ స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన... రహదారి ఆక్రమణకు అడ్డుకట్ట
విశాఖ మన్యంలోని ఓ పాత రహదారిని కబ్జాదారుల చెర నుంచి ఈటీవీ భారత్ కాపాడింది. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలన్న గిరిజనుల ఆవేదనపై ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన అధికారులు... ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
హుకుంపేట మండలం అరకు-పాడేరు ప్రధాన పాత ఆర్ అండ్ బీ రహదారిని హుకుంపేటకు చెందిన ఓ వైకాపా నాయకుడు గత నెల రోజులుగా జేసీబీ ద్వారా చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పాడేరు నుంచి అరకు వెళ్లే రహదారి పక్కన ఉన్న ఈ ప్రాంతం... ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఆక్రమించేందుకు యత్నించారని చెప్పారు. నెలరోజులుగా తాము ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించలేదని... ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలతో అధికారులు దిగి వచ్చారని కొట్నాపల్లి, పెదగరువు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.