G 20 summit in AP: విశాఖలో మార్చి 28, 29 తేదీల్లో జరగనున్న జీ -20 సదస్సుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి అన్నారు. వీఎమ్ఆర్డీఏ హాల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మార్చి నెల 28, 29 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు సంబంధించి, నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు సుమారు 45 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రం నుంచి సుమారు 50 మంది వరకు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు.
వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ టూరిస్ట్ ప్రదేశాలతో పాటుగా.. ప్రాచీన ప్రాచుర్యం కలిగిన ప్రదేశాలను విదేశీయులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విదేశీ ప్రతినిధులకు అర్థమయ్యే భాషలో తెలిపేందుకు ట్రాన్స్ లేటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.