Sharada peetam anniversary : విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే అవకాశం ఉండగా.. పర్యటన తేదీ సైతం ఖరారైంది. కాగా, ఏర్పాట్ల పేరిట అధికారులు అత్యుత్సాహం చూపుతుండడం వివాదాస్పదమైంది. శారదాపీఠం వార్షికోత్సవాలకు ప్రముఖులు రానుండడంతో అక్కడ సుందరీకరణ పనుల్లో అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్న తరుణంలో డివైడర్ల మధ్యలో చెట్లను తొలగించారు. మళ్లీ కొత్తగా అక్కడ కుండీలను పెట్టేందుకు ప్రయత్నాలు వేగంగా చేస్తున్నారు. మరోవైపు ఈనెల 28న పీఠానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక ఖరారు కావడంతో బీఆర్ టీఎస్రోడ్ను ఆనుకుని ఉన్న దుకాణాలను మూసివేయాల్సిందిగా పోలీసులు, జీవీఎంసీ సిబ్బంది ఆదేశించడం చిరువ్యాపారులను తీవ్రంగా కలవరపెడుతోంది. సీఎం పర్యటన చిరువ్యాపారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఏర్పాట్ల సాకుతో తమపై ఈరకంగా ప్రవర్తించవద్దని వేడుకుంటున్నారు.