ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామలమ్మ కొండపై అక్రమ మైనింగ్​కు చెక్.. చర్యలకు సిద్ధమైన అధికారులు - Samalamma hill visakha district latest news update

విశాఖ జిల్లా రావికమతం మండలం సామలమ్మ కొండల్లోని అటవీ భూమిలో అక్రమ మైనింగ్ నిర్వహించిన స్టోన్ ప్లస్ గ్రానైట్ కంపెనీ యాజమాన్యం మెడకు అటవీశాఖ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ నిర్వహించినట్లు నిర్ధారణ కావటంతో.. హైకోర్టులో అటవీశాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో కంపెనీ నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వీలుగా అడుగులు వేస్తున్నారు అధికారులు.

Breaking News

By

Published : Jan 8, 2021, 1:22 PM IST

విశాఖ జిల్లా రావికమతం మండలం సామలమ్మ కొండపై గ్రానైట్ తవ్వకాలకు 2016లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు క్వారీయింగ్ నిర్వహించి భారీ పరిమాణాలతో గ్రానైట్ రాళ్లను తరలించింది. అయితే ఈ కంపెనీకి క్వారీయింగ్​కు అనుమతి ఇచ్చిన ప్రాంతం.. పూర్తిగా రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉందని.. అయినప్పటికీ కెంపెనీకి అనుకూలంగా అనుమతులు మంజూరు చేశారంటూ అధికారులు ఫిర్యాదు చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన కంపెని యాజమాన్యం..

ఈ నేపథ్యంలో 2017లో అటవీ మైనింగ్, రెవెన్యూ సర్వే శాఖల అధికారులు కొండపై సర్వే చేసి మైనింగ్ చేస్తున్న ప్రాంతం రిజర్వ్ అటవీ భూమిలో ఉందని నిర్ధారించారు. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలంటూ అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై కంపెనీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీ ప్రతినిధుల సమక్షంలో మరోసారి జాయింట్ సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశించటంతో మరోసారి సర్వే నిర్వహించారు. అప్పుడు కూడా మైనింగ్ చేస్తున్న ప్రాంతమంతా రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉందని తేలింది.

గ్రానైట్​ను అక్రమంగా తరలించేందుకు కంపెనీ యత్నం..

ఈ వ్యవహారం ఇలా ఉండగానే గత ఏడాది సెప్టెంబర్​లో అక్కడి నుంచి గ్రానైట్ రాళ్ళను తరలించేందుకు కంపెనీ ప్రయత్నించింది. స్థానిక గిరిజనులు, అటవీ శాఖ అధికారులు అడ్డుకోవటంతో వివాదాస్పదమైంది. దీంతో కంపెనీ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. రాళ్ళను తీసుకువెళ్లేందుకు మధ్యంతర ఉత్తర్వులు పొందింది. అయితే అటవీ అధికారులు రాళ్ల తరలింపును నిలువరించి కంపెనీ ప్రతినిధులపై కేసులు నమోదు చేసి, గ్రానైట్ లారీలను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

అటవీశాఖకు అనుగుణంగా కోర్టు తీర్పు..

చివరికి మైనింగ్ జరిగిన ప్రాంతం పూర్తిగా రిజర్వ్ ప్రాంతంలో ఉందని కోర్టుకు నిరూపించటంలో అటవీ శాఖ అధికారులు విజయం సాధించారు. గతేడాది నవంబర్​లో కంపెనీకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో కంపెనీపై చర్యలకు అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానైట్ రాళ్లను తరలించినందుకు.. కంపెనీ నుంచి డబ్బులు రికవరీ చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. అలాగే మైనింగ్ అనుమతులు మంజూరు విషయంలో ఉదారంగా వ్యవహరించిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చినట్లు అధికారిక సమాచారం. మరోవైపు కంపెనీ ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు కావటం త్వరలో వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సామలమ్మ కొండపై అక్రమ మైనింగ్ నిర్వహించిన అంశానికి సంబంధించి పూర్తి వివరాలతో న్యాయస్థానానికి నివేదిక అందజేయటం.. తమ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చిందని విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి రామ్ నరేష్ పేర్కొన్నారు. ఈ మేరకు మైనింగ్ చేసిన కంపెనీ యజమానులపై ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ , ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి రామ్ నరేష్

ఇవీ చూడండి...

విశాఖలో మళ్లీ తెరపైకి వచ్చిన రింగువలల వివాదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details