విశాఖ మన్యంలో కాల్సైట్ ఖనిజం తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పిలిచిన టెండర్లు వివాదాస్పదం అవుతున్నాయి. టెండరు నిబంధనలపై గిరిజన సంఘాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. అనంతగిరి మండలం నిమ్మలపాడు గ్రామ పరిధిలో 8.725 హెక్టార్లు, 24 హెక్టార్లలో రెండు లీజులను గతంలో ఏపీఎండీసీకి కేటాయించారు. వీటిలో దాదాపు 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల కాల్సైట్ ఖనిజం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు లీజుల్లో ఖనిజ తవ్వకాలు, విక్రయాలకు ఏపీఎండీసీ గత నెలలో టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 9తో గడువు ముగియాల్సి ఉండగా, 15 వరకు పొడిగించారు.
కాల్సైట్‌కు గనులశాఖ సీనరేజ్ రుసుము టన్నుకు రూ.90 ఉండగా, దీనికి ఒకటిన్నర రెట్లు అదనంగా టన్నుకు రూ.225ను కనీస ధరగా ఏపీఎండీసీ ఖరారు చేసింది. దీనికంటే ఎవరు ఎక్కువ చెల్లిస్తామని కోట్ చేస్తే వారికి టెండర్లు దక్కుతాయి. ఈ మొత్తంతోపాటు, ప్రతి టన్నుకు సీనరేజ్ ఫీజు, జిల్లా ఖనిజ నిధి, మెరిట్ అదనంగా గనులశాఖకు చెల్లించాలి. ఈ లీజులు ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో గిరిజనులు వ్యక్తిగతంగా (ట్రైబల్ ఇండివిడ్యువల్స్) టెండర్లలో పాల్గొనేలా నిబంధన విధించారు. గిరిజనులు భాగస్వాములుగా ఉన్న సంస్థలకు అవకాశం ఇవ్వలేదు.
'గ్రామసభ లేదు.. సొసైటీలకు అవకాశమివ్వలేదు'