రాష్ట్రంలోని బోధనాఆస్పత్రుల్లో జీవో నంబర్ 44 ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న నర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నర్సింగ్ డే (ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి) సందర్భంగా విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నర్సింగ్ సిబ్బంది ప్లకార్డుల్ని ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు.
కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలలో హెచ్చు తగ్గులను సరిచేసి, సమానపనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఎం.ఇందిరా కోరారు. పీపీఈ కిట్లను ధరించి ఎనిమిది నుంచి 12 గంటలు కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తమలో కొందరు విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు నర్సుల కుటుంబీకులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, హెల్త్ కార్డులిచ్చి ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.