విశాఖ జిల్లాలోని అనకాపల్లి నూకాలమ్మ ఆలయ కార్యనిర్వాహక అధికారిణి ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవు పెట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆలయంలో తెదేపాకు చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని వైకాపా నాయకులు ఆలయ ఈఓ అన్నపూర్ణ మీద ఆరోపణలు చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫలితంగా వైకాపా నేతలకు ఈఓకు మధ్య సఖ్యత లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులు జాతర నిర్వహించేందుకు అనువుగా లేనందు వల్ల తాను ఏర్పాట్లు చేయలేనని ఈఓ చెప్పారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయలేదని, గోడలకు రంగులు సైతం వేయలేదని వైకాపా నాయకులు విమర్శించారు.
అప్పుడు లాక్డౌన్ వల్ల..
గత ఏడాది లాక్డౌన్ కారణంగా జాతర నిర్వహించలేదు. అయితే ఈసారి భారీగా భక్తులు తరలిరావచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లు కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని వైకాపా నేతలు అభిప్రాయపడుతున్నారు. దేవాదాయ శాఖకు కొన్ని నిబంధనలు ఉంటాయని.. వాటికి అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని ఈఓ తన సిబ్బందికి చెప్పినట్లు తెలిసింది. అనకాపల్లి నూకాలమ్మ జాతర ఏర్పాట్లపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.