NTR CENTENARY CELEBRATIONS : విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వుడా చిల్డ్రన్ థియేటర్‌లో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా... పలువురికి లోక్ నాయక్, ఎన్టీఆర్ పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, నటీమణులు జయప్రద, జయసుధలు... ఎన్టీఆర్ పురస్కారాలు అందుకున్నారు.
"నందమూరి తారకరామారావు గారు తెలుగు వారికి ఆరాధ్యుడు. మహానటుడు. ఆయనొక యుగపురుషుడు. ఆయనకి మరణం లేదు ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన కీర్తి, చేసిన పనులను సమాజం గుర్తుంచుకొంది అంటే నిజంగానే ఆయనకు మరణం లేదు"-వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్‌కు, లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాలను కూచిభొట్ల ఆనంద్ (అమెరికా), కోనేరు సత్యనారాయణ (కేఎల్ వర్సిటీ), గన్ని భాస్కరరావులకు (జీఎస్‌ఎల్ వైద్యకళాశాల) అందజేశారు. ఎన్టీఆర్ ఒక సినీ యుగ పురుషుడని, ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వెంకయ్యనాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ పేరు మీద అవార్డ్ అందుకోవడం తనకు ఆనందంగా ఉందని రాఘవేంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
"జనరల్‌గా అవార్డు తీసుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. కానీ ఈ రోజు చాలా గర్వంగా ఉంది. అన్నగారి పాట చూసిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంది. ఒకటే అనుకున్న.. ఆయన పుట్టిన గడ్డ మీద పుట్టడం.. ఈరోజు ఆయన అవార్డు తీసుకోవడం. ఇంత కన్నా గర్వం ఇంకోటి లేదు"-రాఘవేంద్రరావు, సినీ దర్శకుడు