Grain Farmers Faceing Problems : రైతన్నకు పంట పండించడం కంటే.. దానిని అమ్ముకోవడం పెను సమస్యగా మారింది. పండించే ప్రతి పంటకు ప్రజల్లో డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నా.. వినియోగదారుడికి చేరవేయడంలో అన్నదాత వెనుకబడిపోతున్నాడు. గత ప్రభుత్వాలు రైతు నుంచి పంటను కొనుగోలు చేయడానికి మార్గాలు సుగమం చేసే ప్రయత్నాలు చేయగా.. వైఎస్సార్సీపీ సర్కారు నిబంధనలతో ప్రతిబంధకాలు పెడుతోందని రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పొలాల వద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తామని చెప్పినా.. ఈ - క్రాపింగ్, ఆన్‌లైన్ నమోదు అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నియమాలు రైతులకు ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఈ ప్రక్రియల్లో ఎదురవుతున్న సమస్యలు రైతు పాలిట శాపంగా మారుతున్నాయి. బహిరంగ మార్కెట్లలో పంట అమ్ముకోవడానికీ వీలు లేకుండా చేస్తున్నారంటూ రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. తమ నిస్సహాయతను దళారులు సొమ్ముచేసుకోవడానికి చూస్తున్నారని వాపోతున్నారు.
సంక్రాంతికి ముందే కొనాల్సిన ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో.. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం ఢంగభద్ర రైతులు ఆందోళనకు దిగారు. ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. ఢంగభద్ర గ్రామంలో సుమారు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాల్లోనే మూలుగుతోంది. అకాల వర్షం పడితే పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంట అమ్ముడుకాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన రైతులు.. శుక్రవారం నాడు ఆందోళన చేపట్టారు. రైతుభరోసా కేంద్రానికి వెళ్లి.. వ్యవసాయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
"ఎక్కడి ధాన్యం అక్కడే కల్లాలలో ఉంది. ఈ క్రాప్ ద్వారా పంట కొనుగోలు లేదు. దళారులు క్వింటాలుకు 1300 రూపాయల చొప్పున అమ్మమని అడుగుతున్నారు. అధికారులు 42 కిలోలు ఒక బస్తాకు నింపాలని సూచిస్తున్నారు. మిల్లర్లు 44 కేజీలు ఉండాలని అంటున్నారు. మొన్న వచ్చిన వర్షానికి ధాన్యం తడిసింది. రైతు భరోసా కేంద్రంలో అడిగితే మేమేం చేయాలి అంటున్నారు." -రైతు