పౌష్టికాహార లోపం వల్ల విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ అనంతగిరి మండలం రొంపిల్లిలో... నలుగురు గిరిజనులు మృతి చెందారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ. అజా శర్మ, ప్రజా ఆరోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి టీ. కామేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమస్యను రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రికి తెలియజేశామన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించిన అజాశర్మ, కామేశ్వరరావు.. తమ పరిశీలనల్లో విస్తుపోయే వాస్తవాలను గుర్తించామని తెలిపారు. రక్షిత మంచి నీరు, వైద్యం, విద్య, రహదారి సౌకర్యాలు అందుబాటులో లేవన్నారు. భూ రికార్డుల పేరుతో స్థానికుల భూములను ఇతరులు స్వాధీనపర్చుకుంటున్నట్టు గుర్తించామన్నారు. ఈ గిరిజన గ్రామాలు అనంతగిరి మండల కేంద్రానికి 75 కిలోమీటర్లు, పాడేరు ఐటీడీఏకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణంగా.. అధికారులు దృష్టి సారించడం లేదని ఆగ్రహించారు.