విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు ఏటా నూక తాత జాతర నిర్వహిస్తారు. ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే... దేవుడు రూపంలో పూజారి నడిచి తమను తొక్కుకుంటూ వెళ్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి తరువాత వచ్చే అమావాస్య నాడు నూక తాత మరణించడంతో ఏటా ఇదే రోజు జాతర చేస్తారు. ఆ రోజు రాజయ్యపేట గ్రామం జనసంద్రాన్ని తలపిస్తుంది.
నూక తాత జాతర... ఆ పాదం తాకితే నిజమైన సంబరం... - విశాక జిల్లా రాజయ్యపేటలో నూకతాత జాతర
ఆ ప్రాంతంలో పూజారే నడిచొస్తుంటే....ఆ ప్రజలకు ఎంతో ఆనందం. ఆయన పాద స్పర్శ తగిలితే మంచి జరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. నడిచొచ్చే దేవుడి పండగొచ్చిందంటే చాలు...ఒక్కొక్కరు తొక్కించుకోవడానికి బారులు తీరుతారు. ఇంతకీ ఎక్కడో తెలుసా!
నూక తాత దేవుడిగా మారడం వెనుక స్థానికులు తెలిపే ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతం నుంచి కొందరు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి వాయుగుండం చిక్కుకుని మరణించారు. అప్పుడు స్థానికులు దీనికి సమీపంలో ఉన్న బుచ్చిరాజు పేట గ్రామానికి వలస వెళ్లిపోయారు. కొన్నాళ్లకు మత్స్యకార వర్గానికి చెందిన రాజయ్య పాత స్థానం నుంచే వేట సాగించాలని నిర్ణయించాడు. ఆయన అక్కడికి వెళ్లి స్థిరపడటంతో..మిగిలినవారు కూడా అదే ఊరికి వెళ్లారు. దీంతో రాజయ్య గ్రామాన్ని ఏర్పాటు చేశాడని అప్పటినుంచి అతని పేరు మీద రాజయ్యపేట అనే ఊరుగా పిలివడం మొదలుపెట్టారు. రాజయ్యకు ముగ్గురు కొడుకులు ఉండగా... వీరిలో నూక తాత అనే వ్యక్తి గ్రామాభివృద్ధికై, ప్రజల కోసం తనువు చాలించాడు. ఇతను దేవుడితో మాట్లాడేవాడని ప్రచారంలో ఉంది. అదే దేవత వరంతో ఇదే గ్రామంలో దేవుడుగా వెలిశాడని అక్కడి మత్స్యకారులు చెబుతుంటారు. అందుకు గాను నూక తాత గుడి నిర్మించారు... ఏటా మూడు రోజులపాటు జాతర నిర్వహిస్తుంటారు. సమీప బోయపాడు సముద్రతీరంలో భక్తులు స్నానాలు ఆచరించి ...దారిలో పడుకుంటారు. నూకతాత పూజారిలో ఆవహిస్తాడని ప్రజల విశ్వాసం. పూజారి తొక్కుకుంటూ వెళితే ..అతని పాద స్పర్శ తగిలితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.