విశాఖపట్నం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులూ కోలాహలంగా నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులనామినేషన్ ప్రక్రియ పూర్తయింది. విశాఖ పార్లమెంట్ స్థానానికి శ్రీ భరత్ నామపత్రం దాఖలు చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి గణబాబు ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. తెదేపా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇతర ప్రధాన పార్టీల నుంచీ....!
చోడవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గూనూరు వెంకటరావు ఊరేగింపుగా వెళ్లి నామపత్రం దాఖలు చేశారు. విశాఖ ఉత్తర వైకాపా అభ్యర్థి కేకే రాజు తమ పార్టీ నాయకులతో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లారు. అరకు లోయ వైకాపా అభ్యర్థి శెట్టి ఫాల్గుణ నామపత్రం దాఖలు చేశారు. అనకాపల్లిలో ఒకేరోజు మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కరరావు, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. గంగాధర్, భాజపా అభ్యర్థి పొన్నగంటి అప్పారావులు నామపత్రాలు దాఖలు చేశారు.