విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, కడపలోని ముఖ్యమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించి రిసార్ట్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి భవనాల నిర్మాణం ప్రారంభించారు. బిల్లులు సరిగా చెల్లించడం లేదని గుత్తేదారు సంస్థలు సగంలోనే పనులు నిలిపివేశాయి. పాత బిల్లులు చెల్లించేందుకు ప్రస్తుతం రూ.35 కోట్లకు పైగా కావాలి. శ్రీకాకుళం జిల్లా జగతిపల్లిలో రిసార్ట్ పనులు ప్రాథమిక దశలోనే నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా అహోబిలంలో భక్తులకు అదనపు వసతి కల్పించేందుకు ప్రారంభించిన భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదు.
పర్యాటక సంబంధిత అత్యవసర పనుల కోసం జిల్లాకు ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయిస్తోంది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే జిల్లా పర్యాటక మండలి ఈ నిధులతో సదుపాయాలు కల్పిస్తుంది. ఇలా జిల్లా కలెక్టర్లు కేటాయించిన పనులకూ మరో రూ.35 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాలి. ఈ కారణంగా కొత్త పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పనులైతే పూర్తయినా బిల్లులు చెల్లించేందుకు నిధుల్లేవు. కొద్దికాలంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యాటక రంగానికి కొత్త పనులు మంజూరు చేయడం లేదు. కొన్ని జిల్లాలో మంజూరు చేసినవీ సాగడం లేదు.
అనుమతి సరే.. రుణమేది..?