ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాన్ మందకొడిగా సాగుతోందని ఆంధ్ర విశ్వ విద్యాలయ వాతావరణ అధ్యయన నిపుణులు ఆచార్య ఎస్ఎస్వీఎస్ రామకృష్ణ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ అర్ధరాత్రి లేదా గురువారం తెల్లవారుజాము వరకు చెన్నై - మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఆగ్నేయంగా.. చెన్నైకి ఆగ్నేయంగా ఉన్న నివర్... క్రమేపి బలపడుతోందని అంటున్నారు. తుపాను తీరం దాటిన తరువాత రాయలసీమ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
తుపాను వల్ల గాలి వేగం గంటకు 80 నుంచి 120 కి.మీ వరకు ఉంటుందని.., గాలి వల్ల ప్రమాదం లేనప్పటికీ భారీ వర్షాలు కుదిపేస్తాయని అన్నారు. తుఫాన్ తీరం దాటాకా సముద్రం నుంచి తేమను తీసుకునే పరిస్థితి ఉండదని అందువల్ల బలహీన పడే అవకాశం ఉందన్నారు.