విశాఖ పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్లో హైడ్రోజన్ సల్ఫైడ్ లీక్ వల్ల ప్రమాదం జరిగినట్లు..జిల్లా కలెక్టర్ ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై వార్తా కథనాల ద్వారా సుమోటోగా కేసును తీసుకుని ఎన్జీటీ విచారణ చేపట్టింది. ఈ ఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్ నలుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదిక సమర్పించారు.
సాయినార్ లైఫ్ సైన్సెస్లో హైడ్రోజన్ సల్ఫైడ్ లీక్ ప్రమాదం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. బెంజిన్ మెడిజోన్ వెళ్లే పైపు సరిగ్గా అమర్చకపోవటంతో గ్యాస్ లీకైనట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారని, నలుగురు అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు కోలుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు. కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని నివేదిక వెల్లడించింది. ప్రమాదం తర్వాత కంపెనీలో ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఫార్మా కంపెనీ రూ. 35 లక్షలు పరిహారం ప్రకటించినట్లు చెప్పారు. ఫార్మా కంపెనీపై పరిశ్రమల విభాగం నిషేధిత ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. సాయినార్ ఫార్మా కంపెనీపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు తెలిపారు.