Visakhapatnam Global summit, G-20 meetings updates: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్, 28, 29 తేదీల్లో జీ-20 సదస్సులు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు గ్లోబల్ సమ్మిట్ పేరుతో తాజాగా రోడ్డుకు ఇరువైపులా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న తోపుడు బళ్లను, చిరు వ్యాపారాలను తొలగించారు. సమ్మిట్ పేరుతో అధికారులు తోపుడు బళ్లను, చిరు వ్యాపారాలను తొలగించడం అన్యాయమని.. ఆ తొలగింపులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జీ-20 పేరుతో అధికారులు తొలగిస్తున్న తోపుడు బళ్లు, చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఆనాడూ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి.. ఆ సమయంలో వారికి జీవన భృతి ఇచ్చామని గుర్తు చేశారు. మార్చిలో జరగబోయే జీ-20 సదస్సులకు తాము వ్యతిరేకం కాదని, కానీ సదస్సుల పేరుతో అధికారులు పేదల పొట్టను కొట్టడాన్ని మాత్రం టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి మాట్లాడుతూ.. తోపుడు బళ్లు తొలగించిన తర్వాత.. ఆ భూములను అమ్ముకుంటారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తోపుడు బళ్ల యజమానులకు, చిరు వ్యాపారులకు న్యాయం చేసేవరకూ నిరసన కొనసాగిస్తామన్నారు. అధికారులు స్పందించి చిరు వ్యాపారులు.. వారి వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఎదైనా స్థలాన్ని కేటాయించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. తమ నిరసనను తెలియజేశారు.