New technique used by smuglers: హైదరాబాద్ విమానాశ్రయం మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు వందల కోట్ల విలువైన సూడోఎఫిడ్రిన్ తరలిస్తూ పట్టుబడ్డ ముఠా కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియా పంపేందుకు సిద్ధం చేసిన రూ.9 కోట్ల విలువైన 8.5 కిలోల సూడోఎఫిడ్రిన్ను ఇటీవల నాచారం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో తొలుత 15 సార్లు మాత్రమే పంపామని నిందితులు అంగీకరించారు. అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరింత లోతుగా విచారించగా అరెస్టయిన నిందితులు మలేషియా, సింగపూర్ సహా మరికొన్ని దేశాలకు భారీగా సూడోఎఫిడ్రిన్ రవాణా చేసినట్లు తేలింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు పంపించిన చిరునామాలు, నిందితులు ఫోన్ డేటా, రవాణాకు ఉపయోగించిన కొరియర్ సంస్థల నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు.. మరిన్ని దేశాలకు పంపినట్లు తేల్చారు. ఈ కేసులో పరారీలో ఉన్న చెన్నైకి చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ రహీమ్‌కు, ఇతర దేశాల్లోనూ భారీ నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు.