విశాఖ నగర పరిధిలోని 23 పోలీసుస్టేషన్ల పరిధిలో సుమారు 400 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో సుమారు 100 నుంచి 140 మంది వరకు ఇప్పటికీ ఆగడాలు కొనసాగిస్తున్నారు. వీరిలో అత్యంత ప్రమాదకరంగా మారిన వారు దాదాపు 15 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల నగరంలో జరిగిన భూ తగాదాల్లోనూ వీరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు రౌడీషీటర్లు రాజకీయ నాయకుల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు ప్రధాన ముఠాలకు చెందిన రౌడీషీటర్లు ఒకరిపై మరొకరు దాడులకు దిగేందుకు వ్యూహరచన చేసినట్లు పోలీసులకు సమాచారం వచ్చినట్లు తెలిసింది. కొంత కాలంగా ఈ రెండు ప్రధాన గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో ఉంది. గతంలో కొందరిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించినా మార్పు రాలేదు. దీంతో ఈ రెండు వర్గాలకు అడ్డుకట్ట వేయాలంటే తప్పనిసరిగా నగర బహిష్కరణే మార్గమని భావిస్తున్నారు. ఇటీవల నగరంలోని అన్ని స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిచి వారి వివరాలను సేకరించారు. కొత్త సీపీ మనీష్‌కుమార్ సిన్హాకు వీటిని అందించినట్లు తెలిసింది. సీపీ తీసుకునే నిర్ణయం ఆధారంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.