విశాఖ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినాథరావు, ఎస్‌ఐ సతీష్‌లను వీఆర్‌కు పంపిస్తూ సీపీ మనీష్‌కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన సోమవారం సాయంత్రమే ఆయన ఈ దస్త్రంపై సంతకం చేసినట్లు సమాచారం.
కొన్నాళ్లుగా టాస్క్‌ఫోర్స్ వ్యవహారాలపై నిఘా వర్గాలు పోలీసు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయి. పలు అంశాలను స్పెషల్ బ్రాంచి పోలీసులు గత కమిషనర్ మీనాకు వివరించినట్లు సమాచారం. ఈ విషయమై ఆయన అప్పటికే దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని భావించినట్లు సమాచారం.
పెండింగ్ రిపోర్టులపై ఆరా..
కొత్తగా వచ్చిన సీపీ పెండింగ్ రిపోర్టులపై ఆరా తీయగా, ఈ విషయం ప్రస్తావనకు రావటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సీపీ తీసుకున్న ఈ నిర్ణయం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆర్థికపరమైన లావాదేవీల అంశంలో వచ్చిన ఫిర్యాదులపై ఈ నిర్ణయం తీసుకున్నారా? లేకుంటే వేరే ఇతర కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఇకపై టాస్క్‌ఫోర్స్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని డీసీపీ-1కు నివేదిక ఇవ్వాలని సీపీ ఆదేశించారు.
డీసీపీ-1కు రిపోర్టు చేయాలి...
ఇకపై మహిళా పోలీసుస్టేషన్‌కు సంబంధించిన అంశాలను డీసీపీ-1కు రిపోర్టు చేయాలని దిశా పోలీసు స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ను ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా త్రినాథరావు బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. అయితే కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు జరిపినట్లుగా పూర్వ సీపీకి పలువురు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ సతీష్ కూడా ఏడాది క్రితమే విధుల్లో చేరగా, ఆయనను కూడా వీఆర్‌కు పంపించారు. టాస్క్‌ఫోర్స్, దిశా పోలీసుస్టేషన్ల పర్యవేక్షణ ఇకపై డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:ఆ ఖజానా ఎవరిది..!