Neck Srack Stroke Syndrome : ఓ 50 ఏళ్ల మహిళ.. కురులకు మెరుగులు దిద్దుకుందామని బ్యూటీపార్లర్‌కు వెళ్లారు. బ్యూటీషియన్ ఆమె తలను వాష్‌బేసిన్ వైపు వెనక్కి బాగా వంచి.. షాంపూతో శుభ్రం చేశారు. ఈ ప్రక్రియలో తలను 40-50 నిమిషాల పాటు వెనక్కి వంచి ఉంచారు. ఆ మహిళ ఇంటికి చేరుకున్న కొన్ని గంటల తర్వాత మెల్లగా తల తిరిగినట్టయింది. కడుపులో తిప్పి వాంతులయ్యాయి. వెంటనే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును సంప్రదిస్తే.. అజీర్ణ సమస్యని కొన్ని మందులిచ్చారు. వాటిని వేసుకున్నా తగ్గకపోగా, రెండో రోజు లక్షణాలు మరింత పెరిగాయి. నడక, మాటలో తడబాటు, తూలడం వంటి సమస్యలు రావడంతో న్యూరాలజిస్టును సంప్రదించారు. అప్పుడు అసలు సమస్య బయటపడింది. పార్లర్‌లో జుట్టును కడిగేందుకు తలను బాగా వంచే క్రమంలో చిన్న మెదడు (సెరిబ్రల్లా)కు రక్తం సరఫరా చేసే వెరిటెబ్రల్ రక్తనాళం బాగా ఒత్తిడికి గురైనట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో గుర్తించారు. ఫలితంగా మెదడుకు రక్తం సరఫరా తగ్గి.. సెరిబ్రల్లా వద్ద చిన్న కణితి ఏర్పడినట్లు పరీక్షల్లో తేలింది. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చగా.. వైద్యులు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
అందం కోసం వెళితే..చాలా మంది మహిళలు, పురుషులు తరచూ బ్యూటీపార్లర్లు, సెలూన్లకు వెళుతుంటారు. వాటిలో జుత్తుకు షాంపూ పెట్టడం.. ఫేషియల్ చేయడం వంటి ప్రక్రియల్లో కొందరు తలను వెనక్కి బాగా వంచుతుంటారు. ఇలా ఎక్కువ సమయం 20 డిగ్రీల కంటే ఎక్కువగా తలను వెనక్కి వంచితే మెడ భాగంలోని సున్నితమైన నరాలపై ఒత్తిడి పడి కొన్నిసార్లు అది బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్, నెక్‌క్రాక్ స్ట్రోక్ సిండ్రోమ్‌కు దారి తీస్తుందని, ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్త్రీ, పురుషులెవరైనా సరే.. అడ్డదిడ్డంగా తలను వెనక్కి వంచడం, తల, మెడపై మర్దన పేరుతో దబాదబా బాదడం లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. శిక్షణ లేని బ్యూటీషియన్ల వద్ద మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తున్నారు.