ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ తీరం వేదికగా.. నేవీ డే పండగ - నేడు విశాఖ తీరాననౌకదళ దినోత్సవం

నేడు నావికాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరాన సిబ్బంది విన్యాసాలు చేయనున్నారు.

Navy_Day_Related
Navy_Day_Related

By

Published : Dec 4, 2019, 3:58 AM IST

Updated : Dec 4, 2019, 8:46 AM IST

విశాఖ తీరాన నావికాదళ దినోత్సవం

విశాఖ తీరం వేదికగా.. నేడు నావికాదళ దినోత్సవం జరగనుంది. విశాఖలో తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో జరగనున్న వేడుకలకు సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

అబ్బురపరచనున్న విన్యాసాలు

సందర్శకులను అబ్బుర పరిచే రీతిలో భూమి, ఆకాశంతో పాటు సముద్ర జలాలపై విన్యాసాలు చేయనున్నారు. మన నావికాదళ ఆయుధ సంపత్తిని, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల పనితీరు, విపత్తుల సమయాల్లో అందించే సహాయక చర్యలు వంటి విషయాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించనున్నారు.

భారత నావికాదళానికి వెన్నెముక తూర్పునావికాదళం

భారత నావికా దళానికి వెన్నెముకగా తూర్పు నావికా దళం సేవలు అందిస్తోంది. లుక్ ఈస్ట్ పాలసీ వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు తూర్పు తీర ప్రాంత భద్రతకు పెద్ద పీట వేస్తున్నాయి. 1968లో ప్రారంభమైన తూర్పు నావికాదళ పయనం.. 1971లో పాక్ పై భారత్ సాధించిన యుద్ధ విజయంలోకీలక భూమిక పోషించే స్థాయికి ఎదిగింది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి విశాఖలో ఆతిథ్యమిచ్చి... అనేక దేశాలకు మన శక్తి సామర్థ్యాల్ని పరిచయం చేసింది. ప్రస్తుతం 45 యుద్ధనౌకలు, జలాంతర్గాములు తూర్పుతీరాన్ని పహారా కాస్తున్నాయి. దశల వారీగా వచ్చే 15 ఏళ్లలో 90 యుద్ధనౌకలను సమకూర్చుకునే దిశగా పయనిస్తూ... మన భద్రతకు భరోసానిస్తోందని తూర్పు నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ తెలిపారు.

సరికొత్త విధానంతో ముందుకు

హిందూ మహా సముద్రంలో ఏటా ఒక లక్షా 20 వేల నౌకలు తిరుగుతుంటాయి. మన నౌకలకు, సరిహద్దులకు ఎలాంటి ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే... స్నేహ పూర్వక దేశాలకు సహకారాన్నీ అందిస్తోంది. ఎలాంటి ముప్పునైనా ధీటుగా అత్యంత వేగంగా ఎదుర్కొనే సామర్థ్యం దిశగా భారత నావికాదళం గత రెండేళ్లుగా సరికొత్త విధానాన్ని అనుసరిస్తోంది. ' మిషన్ డిప్లాయ్ మెంట్' అధికారుల్ని పలుచోట్ల మోహరిస్తోంది. ఉత్తర బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర భాగాల్లో తూర్పు నావికాదళం కీలక పాత్ర పోషిస్తోంది. విమాన వాహక నౌక విక్రాంత్ తూర్పు నావికాదళం కేంద్రంగా పని చేయనుంది. దీన్ని నిలిపేందుకు అనువైన ప్రదేశాన్నీ ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న విక్రాంత్ వచ్చే రెండేళ్లలో దళంలోకి ప్రవేశించనుంది. మరోవైపు ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలు, సంయుక్త విన్యాసాలు పొరుగు దేశాలకు, సన్నిహిత దేశాలకు సైతం మరింత చేరువ చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్న మిలాన్-2020 విశాఖ వేదికగా జరగనుంది. మిలాన్ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 40కిపైగా దేశాలను ఆహ్వానించారని వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ తెలిపారు.

ఇవీ చదవండి

'మిలాన్' నేవీ విన్యాసాలకు 41 దేశాలకు ఆహ్వానం

Last Updated : Dec 4, 2019, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details