విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పీఠం చర్చనీయాంశంగా మారింది. ఈ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.
వైకాపా తరఫున బలిఘట్టం నుంచి గెలుపొందిన గుదిబండ ఆదిలక్ష్మి, పెద్దబొడ్డేపల్లి నుంచి గెలుపొందిన బోడపాటి సుబ్బలక్ష్మి పేర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి వైకాపా తీర్థం పుచ్చుకున్న చక్క బాలమ్మ పేరు కూడా ప్రధానంగా ఛైర్మన్ పీఠం కోసం వినిపిస్తున్నాయి. ఇందుకోసం పార్టీ నాయకులతోనూ, గెలుపొందిన కౌన్సిలర్లతోనూ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు వైస్ ఛైర్మన్ ఎంపిక అత్యంత కీలకంగా మారింది. ఇందుకోసం ఐదు వార్డు నుంచి గెలుపొందిన గొలుసు నరసింహమూర్తితో పాటు 8వ వార్డు నుంచి విజయం సాధించిన కోనేటి రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.