Nara Lokesh Yuvagalam Padayatra End:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో (సోమవారం) ముగిసింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన 'యువగళం' పాదయాత్ర ఈరోజు అనకాపల్లి జిల్లా అగనంపూడిలో ముగిసింది. పాదయాత్రలో భాగంగా యువనేత నారా లోకేశ్ రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు, 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాలోని ప్రజలు, మహిళలు, కార్యకర్తలు, యువత పెద్దఎత్తున ఆయనకు మద్దతు పలికారు.
Yuvagalam End Updates:టీడీపీ యువనేత నారా లోకేశ్ "యువగళం" పాదయాత్ర సోమవారంతో దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన అనకాపల్లి జిల్లా అగనంపూడిలో భారీ పైలాన్ ఆవిష్కరించారు. కుప్పంలో మొదలైన లోకేశ్ పాదయాత్ర 226 రోజుల పాటు 3 వేల 132 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు, ఆంక్షలు విధించినా యువనేత లోకేశ్ వాటిన్నింటినీ అధికమించి, ఈరోజు దిగ్విజయంగా పాదయాత్రను ముగించారు. అంతేకాదు, పాదయాత్రలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, బాధితులకు తాను అండగా ఉన్నానంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు.
కోలాహలంగా యువగళం పాదయాత్ర - లోకేశ్ వెంట నడిచిన భువనేశ్వరి, కుటుంబ సభ్యులు
Lokesh Inaugurated Huge Pylon at Aganampudi: యువనేత నారా లోకేశ్ తాను చేపట్టిన 'యువగళం' పాదయాత్ర ముగింపునకు గుర్తుగా అనకాపల్లి జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన భారీ పైలాన్‌ను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ముగింపు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయన్న పాత్రుడితో పాటు సీనియర్ నేతలు, వేలాదిగా కార్యకర్తలు, భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వీరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు "వస్తున్నా మీకోసం" పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో చంద్రబాబు తనయుడు లోకేశ్ సైతం యువగళం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించేశారు.
Nara Lokesh Comments:''యువగళం పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడు. ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై చేసిన దాడిని కళ్లారా చూశాను. భవిష్యత్‌పై ఆశలు కోల్పోయిన యువతకు భరోసానిచ్చాను. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీలకు కట్టుబడి ఉంటాను. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే ఈ యువగళం పాదయాత్ర. యువగళం అణచివేతకు గురైన వర్గాల గొంతుకైంది. యువగళం-ప్రజాగళమై నిర్విరామంగా కొనసాగింది. యువగళాన్ని విజయవంతం చేసిన రాష్ట్ర మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.'' అని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు.