తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రేపు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రికపై లోకేశ్ రూ.75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేశ్ ప్రజాధనంతో రూ. 25 లక్షల చిరుతిళ్లు తిన్నారని ఆ పత్రికలో కథనం ప్రచురితమైంది.
ఆ పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని.. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ.. లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి రూ. 75 కోట్లకు జిల్లా కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా.. గురువారం విశాఖ కోర్టుకు లోకేశ్ స్వయంగా హాజరుకానున్నారు.