విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం కిత్తంపేట గ్రామంలో నూతనంగా ఎన్నికైన వైకాపా సర్పంచి.. గ్రామస్థులకు కనీసం తాగునీరు ఇవ్వడానికి కూడా వీల్లేదంటూ మంచి నీళ్ల ట్యాంక్‌కి తాళం వేసుకొని వెళ్లిపోయాడని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపా ఒక చిల్లర రాజకీయ పార్టీ అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? అని మండిపడ్డారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికీ నిరాకరించారు అంటే గ్రామాల్లో వైకాపా నాయకుల అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజలు తాగునీరు కోసం ఇబ్బంది పడుతుంటే చూసి ఆనంద పడే శాడిస్టులు వైకాపా నేతలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకి ప్రజలు తగిన బుద్ధి చెప్పేరోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాకు జత చేశారు.
నీళ్ల ట్యాంక్‌కి తాళం వేయడమేంటి..?: నారా లోకేశ్ - AP Political News
వైకాపా నేతల వ్యవహార శైలిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో ఓ సర్పంచి మంచి నీళ్ల ట్యాంక్‌కి తాళం వేసుకొని వెళ్లిపోయాడని ఆక్షేపించారు. గ్రామాల్లో వైకాపా నాయకుల అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
నారా లోకేశ్ ట్వీట్