Story on Baby Deaths Mystery at Rudakota: ఇదీ ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఓ తల్లి గర్భశోకం..! పేరు రాట్నాలమ్మ.! రెండు కాన్పులైనా అమ్మా అనే పిలుపునకు దూరమైందీ మాతృమూర్తి ! ఇద్దరు బిడ్డలు నాలుగేళ్ల వయసు దాటకుండానే తనువు చాలించారు. రాట్నాలమ్మ లాంటివారెందరో ఇక్కడ పుత్రశోకంతో తల్లడిల్లుతున్నారు.
గవర్నర్ స్పందనతో వెలుగులోకి..
ఈ విషాదానికి చిరునామా విశాఖ ఏజెన్సీలోని పాత రూడకోట. ఇక్కడ 138 కుటుంబాలుంటాయి. గడిచిన రెండేళ్లలో 14 మంది శిశువులు ఇక్కడ చనిపోయారు. అంతా ఐదేళ్లలోపువారే. అంతా ఒకే రీతిలో చనిపోయారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పందించడంతో ఇక్కడి విషాదం బయటి ప్రపంచానికి తెలిసింది. శిశువుల మృతికి తాగునీటి కలుషితం కూడా కారణం కావచ్చని అధికారులు తొలుత అనుమానించారు. ఊళ్లో ఐదుచోట్ల నీటి నమూనాలు సేకరించారు. విశాఖలో పరీక్షలు చేయించారు. ఐతే.. తాగునీటిలో సమస్యేమీ లేదని తేల్చారు. ఎందుకైనా మంచిదని ఇనుప పైపుల స్థానంలో ప్లాస్టిక్ హెచ్‌డీ పైపులు వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పట్లో లేనట్లేనా..
ఊళ్లో శిశుమరణాలు వెలుగు చూశాక కేజీహెచ్ నుంచి ఐదుగురు వైద్యనిపుణుల బృందం పాత రూడ కోటను సందర్శించింది. బిడ్డలను కోల్పోయిన తల్లులు.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. మరింత స్పష్టత కోసం కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించాల్సి ఉందని అధికారులు చెప్పారు. అవసమైతే విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లి రక్తనమూనాలు సేకరిస్తామని తెలిపారు. కానీ 20 రోజులైనా ఆ దిశగా చర్యల్లేవు. కొవిడ్ కేసుల దృష్ట్యా ఇప్పట్లో కేజీహెచ్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించే అవకాశం లేదని సంబంధిత అధికారి ఒకరు చెప్తున్నారు. గ్రామంలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది.