janasena allegations on balineni: వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలు, మైనింగ్ అక్రమాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా విచారణకు సిద్ధం కావాలని విశాఖ జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నం గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమాలపై అనకాపల్లి, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను చేస్తున్న ఆరోపణలపై బాలినేని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చౌడపల్లి, ప్రకాశం జిల్లా వెంగముక్కలపాలెం శ్రీకర డెవలపర్ లేఅవుట్లో అక్రమాలు జరిగాయని మూర్తి యాదవ్ ఆరోపించారు. బాలినేని వియ్యంకుడైన కుండా భాస్కర్ రెడ్డి స్వగ్రామమైన జరుగుమిల్లి మండలం కే బిట్ర గుంట గ్రామ పరిసరాల్లో జరిగిన కబ్జాలపై మూర్తి యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా బాలినేని విచారణకు సిద్ధం కావాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో కుండా భాస్కర్ రెడ్డి, ఆయన ఆయన అనుయాయుల పేరిట 140 ఎకరాలలో రొయ్యల చెరువులు ఉన్నాయని వెల్లడించారు. అయితే, పట్టాలున్న 140 ఎకరాలతో పాటుగా మరో 300 ఎకరాలలో భాస్కర్ రెడ్డి పేరిట రొయ్యల సాగు జరుగుతోందని మూర్తి యాదవ్ ఆరోపించారు.
బాలినేని మంత్రిగా ఉన్న సమయంలో.. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్లకు పేరు గాంచిన ప్రకాశంలోని.. చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ క్వారీ యజమానులను బెదిరించినట్లు ఆరోపించారు. వారు వినకపోతే, విజిలెన్స్ దాడులు చేయిస్తామని భయపెట్టి, బాలినేని గ్రానైట్ క్వారీ డంపులను స్వాధీనం చేసుకున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చౌడపల్లిలో భాస్కర్ రెడ్డి వేసిన లేఔట్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అయ్యాయని ఆరోపించారు. తాను సర్వే నెంబర్లతో సహా విఎంఆర్డిఏ కమిషనర్‌కు, అటవీ శాఖ అధికారులకు నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు మూర్తి యాదవ్ తెలిపారు. అయినా ఇప్పటికీ జాయింట్ సర్వేకు వారు సిద్ధం కాలేదని, బాలినేని రాజకీయ ఒత్తిడితో సర్వేను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు.
జనసేన కార్పొరేటర్, పీతల మూర్తి యాదవ్ 'గత నెల రోజులుగా మాజీ మంత్రి బాలినేని, ఆయన వియంకుడి అక్రమాలపై జనసేన పోరాడుతోంది. నిన్న బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ... తాను అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్నారు. బాలినేని వియ్యంకుడి రొయ్యల చెరువులు అక్రమంగా నిర్మించి డబ్బులు తీసుకుంటున్నారా లేదా అనేది వెల్లడించాలి. అనకాపల్లి, అచ్యుతాపురంలో మీ వియ్యంకుడి అక్రమాలు వాస్తవం కాదా? ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని పోరాడుతుంటే నన్ను బెదిరిస్తున్నారు. నేను సాక్ష్యాధారాలతో ముందుకు వచ్చాను. అక్రమాలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. నాపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రకాశం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు బాలినేని అక్రమాలపై విచారణ చేయాలి.'- పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ.
ఇవీ చదవండి: